11/11/2021
సిబిల్ (క్రెడిట్) స్కోర్ పెరగాలంటే?
________________________________
బ్యాంకులు రుణాలు చేసేటపుడు ముందుగా చూసేది సిబిల్(క్రెడిట్) స్కోర్ నే. సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్ ఇస్తారు. లేకపోతే లేదు. దాదాపుగా అన్ని బ్యాంకులు, ఎన్ బీఎఫ్సీలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) ఈ స్కోర్ ఆధారంగానే రుణాలు ఇస్తాయి.. కాబట్టి ముందుగా సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవడం అవసరం.
CIBIL అంటే Credit Information Bureau India Limited అని అర్థం. ఈ సంస్థ మన దేశంలో ఉన్న పౌరులకు చెందిన లోన్ల ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసి స్కోరు ఇస్తుంది. దాన్నే సిబిల్ స్కోరు అనికూడా అంటారు.
ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబందించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా సిబిల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిల్ డిపార్ట్ మెంట్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి సంబందించిన రుణాలు వాటి చెల్లింపులు వివరాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్ ని తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా? లేదా? అనేది పరిగణలోకి తీసుకుని అతనికి ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. స్కోర్ అనేది 900 కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. రిజర్వ్ బ్యాంకు తాజాగా బ్యాంకులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్కోర్ అనేది 750 కి పైగా ఉంటేనే ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ బాగుందని అర్ధం.
క్రెడిట్ స్కోర్ తో ఉపయోగం
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు త్వరగా రుణం పొందే అవకాశం ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే ఋణం రాదని కాదు. కానీ దాదాపు అన్ని బ్యాంకులు ఋణం ఇచ్చేముందు ఆధారపడేది ఈ స్కోర్ పైనే.
సిబిల్ స్కోర్ తక్కువ ఉందని ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరొక బ్యాంకు లోన్ ఇవ్వవచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. స్కోర్ తక్కువ ఉన్న కేసుల్లో ఒకవేళ అతనికి ఏదైనా బ్యాంకు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేట్ తో లోన్ ఇస్తుంది. సిబిల్ స్కోర్ 750 నుండి 900 మధ్యలో ఉంటే సాధారణ వడ్డీ రేట్ తో పొందవచ్చు.
స్కోర్ 700 నుండి 749 మధ్యలో ఉంటే కొంచెం ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. స్కోర్ 650 నుండి 699 మధ్యలో ఉంటే సెక్యూర్డ్ లోన్స్ పొందవచ్చు. అంటే కారు లేదా ఇల్లు వంటి వాటి కోసం తీసుకునే లోన్. కానీ ఎటువంటి తనకా లేకుండా వచ్చే వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, క్రెడిట్ కార్డులను పొందడం కష్టం. సిబిల్ స్కోర్ 650 ఉన్నా.. కొన్ని ఎన్ బీ ఎఫ్ సీలు ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక ఎన్ బీ ఎఫ్ సీ 28% వరకూ వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ఇంత ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. స్కోర్ 550 కన్నా తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపవు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా దగ్గరకు రానివ్వవు.
సిబిల్ స్కోర్ తెలుసుకోవడం
సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే CIBIL కి సంబందించిన అధికారక వెబ్ సైట్ కి వెళ్ళాలి: www.cibil.com
సైటును ఓపెన్ చేసి ఆన్ లైన్ లో ఫారం పూర్తి చెయ్యాలి. పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను నింపాలి. కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత క్రెడిట్ రిపోర్ట్ అనేది ఈ మెయిల్ ద్వారా వస్తుంది.
క్రెడిట్ స్కోర్ తగ్గకూడదు అనుకుంటే ..
బ్యాంకుల్లో రుణాలను తీసుకున్న కస్టమర్లు తప్పనిసరిగా తమ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను క్రమం తప్పక చెల్లించాలి. నెలవారీ పేమెంట్స్(ఈఎంఐ) మిస్ చేస్తే క్రెడిట్ స్కోర్‌పై భారీగా నెగిటివ్ ప్రభావం పడుతుంది. క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీనికోసం ఆన్ లైన్లో ఉచితంగానే క్రెడిట్ స్కోర్ లు అందించే వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి. వీటిలో క్రెడిట్ మంత్రి కూడా ఒకటి. వేతనం పెరగకపోయినా, ఒకదాని వెంట మరో లోన్ తీసుకుంటూ పోతున్నా, క్రెడిట్ కార్డు లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని వాడేస్తున్నా దాన్ని బ్యాంకులు క్రెడిట్‌హంగ్రీగా భావిస్తాయి. అలాంటి అలవాట్లను వెంటనే మార్చుకోవాలి .
అదేవిధంగా క్రెడిట్ ఎక్స్‌పోజర్‌లో ఒక్కసారిగా అనూహ్య పెరుగుదల కూడా ఉండకూడదు. ఒకేసమయంలో లోన్ కోసం పలు బ్యాంకులకు దరఖాస్తు చేయడం మంచిది కాదు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ 850కిపైన ఉంటే అద్భుతమని, 750- 850 మధ్య ఉంటే మంచి స్కోర్ అని భావించాలి. 700- 750 మధ్యలో స్కోర్ ఉంటే ఫర్వాలేదు కానీ వెంటనే మెరుగుపరుచుకుని చర్యలు చేపట్టాలి. సాధారణంగా 24- 44 సంవత్సరాల మధ్య ఎక్కువగా లోన్స్ తీసుకుంటారు. టూవీలర్, కార్, క్రెడిట్ కార్డ్, కన్జూమర్ డ్యూరబుల్స్ .. ఇలా ఉంటాయి. ఈ రుణాల చెల్లింపు సక్రమంగా ఉంటేనే ఆ తరువాత హోమ్‌లోన్‌కు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఉచితంగా క్రెడిట్ స్కోర్
క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సంస్థలన్నీ ఏడాదిలో ఒకసారి ఎలాంటి చార్జీలు లేకుండా కస్టమర్ల అభ్యర్థన మేరకు పూర్తి క్రెడిట్ రిపోర్ట్‌ను ఇవ్వాలని ఆర్‌బీఐ గతంలో ఆదేశాలు జారీచేసింది. దేశంలో 4 క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సంస్థలున్నాయి ప్రతి బ్యూరో నుంచి ఏడాదికి ఒకసారి క్రెడిట్ రిపోర్ట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో ఉచితంగా పొందొచ్చు
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు (ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్) రుణాలు ఇచ్చేటప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో వయసు, ఆదాయం, ఉద్యోగం, నివాస ప్రాంతం సహా క్రెడిట్ స్కోర్ కూడా చూస్తాయి. క్రెడిట్ స్కోరు తక్కువ ఉంటే రుణం రాదు. బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తాయి. అందుకే క్రెడిట్ స్కోర్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. క్రెడిట్ స్కోరు ఎంతుందో ఉచితంగానే తెలుసుకోవచ్చు.
దేశంలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్, ఎక్స్‌పీరియన్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్, క్రిఫ్ హై మార్క్ క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ అనే నాలుగు క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలున్నాయి. ప్రతి బ్యూరో నుంచి మనం ఏడాదికి ఒకసారి క్రెడిట్ రిపోర్ట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో ఉచితంగా పొందొచ్చు. క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్స్ నుంచి ఈ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు.
సిబిల్ వెబ్‌సైట్ https://www.cibil.com/freecibilscore కు వెల్లాలి. ‘గెట్ యువర్స్ నౌ’పై క్లిక్ చేయాలి. అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీనికి మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నెంబర్, ఆధార్, ఓటీపీ వంటి వివరాలు అవసరం. అకౌంట్ క్రియేట్ సహా ఐడెంటిటీ వెరిఫై చేసుకున్న తర్వాత సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు సిబిల్ స్కోరుతో కూడిన డాష్‌బోర్డు కనిపిస్తుంది.
క్రెడిట్ (సిబిల్) స్కోరు పెరగాలంటే..
రిజర్వ్ బ్యాంకు పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలు క్రెడిట్ కార్డులు లేదా లోన్లు ఇవ్వాలంటే...సిబిల్ స్కోరు చూసి అందులో ఉన్న రిపోర్టు ప్రకారమే ఇస్తాయి. సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చెల్లించాల్సిన ఈఎంఐలు టైముకు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల బిల్స్ సకాలంలో చెల్లించాలి. కొత్తగా లోన్ తీసుకుంటే సహజంగానే సిబిల్ స్కోరు తగ్గుతుంది. ఒక వేళ ఆ విధంగా గనక జరిగి ఉంటే ...ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ లోన్‌కు సంబంధించి కనీసం 3 నుంచి 6 నెలల వరకు ఈఎంఐ కరెక్టుగా చెల్లిస్తే చాలు స్కోరు మళ్లీ పెరుగుతుంది. అయినా స్కోరు తగ్గుతుందంటే.. మీకు ఉన్న ఇతర లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులను ఓసారి పరిశీలించాలి.
క్రెడిట్ కార్డులను వాడే వారి సిబిల్ స్కోరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా అంటే..
క్రెడిట్ లిమిట్‌లో 70 శాతం కన్నా ఎక్కువగా వాడితే అప్పుడు ఆ ప్రభావం స్కోరుపై నెగిటివ్‌గా చూపిస్తుంది. దీంతో స్కోరు తగ్గుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ఎప్పుడూ క్రెడిట్ కార్డులను 70 శాతం లిమిట్ లోపే వాడాలి.
కొందరు అవసరం లేకున్నా ఎప్పుడూ లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం విచ్చలవిడిగా అప్లికేషన్లు పెడుతుంటారు. అలా చేస్తే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. నిజంగా అవసరం ఉందనుకుంటేనే లోన్ లేదా క్రెడిట్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
- TEAM DIALLOAN